
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడగా, రాజగోపాల్ రెడ్డి కూడా వెంటనే అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డీ... నువ్వు ఓ రాజకీయ బ్రోకర్, బ్లాక్ మెయిలర్‌వి. తెలంగాణలో టిడిపిని ఏవిదంగా భూస్థాపితం చేశావో అదేవిదంగా కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేస్తావు. నాలుగు పార్టీలు మారి కాంగ్రెస్‌లోకి వచ్చిన చిల్లర దొంగవి నువ్వు నీ కింద మేము పనిచేయాలా?పార్టీలో చాలా మంది నీ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడటం లేదు. నేటికీ జగ్గారెడ్డి, మా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు నీ నాయకత్వాన్ని ఒప్పుకొన్నారా?
కొడంగల్‌లో నీకు తిరుగులేదని చెప్పావు.. అక్కడే ఓడిపోయావు?మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయకుండా సీమాంద్ర ప్రజలు ఎక్కువగా ఉండే మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎందుకు పోటీ చేశావు?వెనక నుంచి చంద్రబాబు నాయుడు సహకరించి గెలిపిస్తారనే కదా?హుజురాబాద్ ఉపఎన్నికలో ఏమి పీకావు?పార్టీలో నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడున్నావు?
భూమికి మూడడుగులు లేవు నువ్వు నన్ను తొక్కేస్తావా?నువ్వు మునుగోడులో కాలుపెడితే ప్రజలు నిన్ను తరిమి తరిమి కొడతారని తెలుసుకో. డబ్బిచ్చి జనాలను తెచ్చుకొని జిందాబాద్ కొట్టించుకొనే చవుకబారు రాజకీయాలు చేసే నీ చేత మేము పాఠాలు చెప్పించుకోవాలా?
జైలుకి వెళ్ళివచ్చిన నీలాంటి వాళ్ళు నా ఇంట్లో కాలు పెట్టకూడదనే నిన్ను మా ఇంటికి రానీయలేదు. నేనే నిన్ను నా ఇంటికి రానీయనప్పుడు తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారని ఎలా అనుకొన్నావు?నాకు కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే నిరూపించగలవా? నీలాగ డబ్బు కోసం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేవాడిని కాను నేను.
ఎక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఊడిపడి పార్టీని కబ్జా చేసేశావు. దానికి నువ్వే తాళం వేసి భూస్థాపితం చేస్తావని కాంగ్రెస్ అధిష్టానం ఇంకా గ్రహించకపోవడం దురదృష్టకరం,” అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు.