టిఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు ఓ సర్పంచ్ భర్త రెక్కీ నిర్వహించడం విశేషం. వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్యను సస్పెండ్ చేసినందుకు ఆమె భర్త ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కక్షతో హత్య చేసేందుకు హైదరాబాద్ చేరుకొన్నాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో గల జీవన్ రెడ్డి ఇంటి ముందు ఈరోజు ఉదయం అతను అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ప్రసాద్ గౌడ్‌ను అదుపులో తీసుకొని తనికీలు చేయగా అతని వద్ద ఓ కత్తి, ఓ నాటు తుపాకీ లభించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని ప్రసాద్ గౌడ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.