3.jpg)
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేడు యాగదగిరి గుట్ట నుంచి 3వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు యాదగిరి పల్లెలో బిజెపి అధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, హాజరుకానున్నారు. బండి సంజయ్ వారితో కలిసి ఉదయం 10 గంటలకు యాదాద్రి చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పూజలు చేస్తారు. ఉదయం 11 గంటలకు సభ మొదలవుతుంది. సభ ముగిసిన తరువాత కేంద్ర మంత్రి షెకావత్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తారు.
24 రోజుల పాటు సాగే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లా మీదుగా సాగి వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ముగిస్తారు. ఇవాళ్ళ యాదగిరిపల్లి, గాంధీ నగర్, యాదగిరిగుట్ట, గణేశ్ నగర్, పాతగుట్ట, గొల్ల గుడిసెలు, దాతారుపల్లి మీదుగా సుమారు 105 కిమీ పాదయాత్ర చేసి రాత్రి బస్వాపూర్ చేరుకొని అక్కడే బస చేస్తారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే. ఎప్పుడు ఎక్కడ ఉపఎన్నికలు వచ్చినా గెలిచేది బిజెపియే. వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్కు 15 సీట్లు కూడా రావు. వచ్చే ఎన్నికలలో సిఎం కేసీఆర్ తన సీటును కూడా గెలవలేరు. ఈటల రాజేందర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది,” అని అన్నారు.