జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 7వ తేదీన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని చేనేత, పవర్ లూమ్ కార్మికులకు భీమా పధకం ప్రారంభించబోతోంది. మంత్రి కేటీఆర్ ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. రైతు భీమా పధకంలాగే ఈ పధకంలో కూడా 60 సంవత్సరాలలోపు వయసున్న చేనేత, పవర్ లూమ్ కార్మికులకు ఈ భీమా సౌకర్యం వర్తింపజేయనుంది. నేత కార్మికులు ఏ కారణంగా చనిపోయినప్పటికీ వారి కుటుంబానికి పదిరోజులలోగా రూ.5 లక్షలు ఎల్ఐసీ అందిస్తుంది. దీనికోసం నేతన్నలు ప్రీమియం చెల్లించనవసరం లేదు కానీ తమ పేరు, కుటుంబ వివరాలు, బ్యాంక్ ఖాతా వగైరా వివరాలను దరఖాస్తులో నింపి అధికారులకు అందజేయవలసి ఉంటుంది. నేతన్న భీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 50 కోట్లు చెల్లిస్తుంది. ఇప్పటికే రూ.25 కోట్లు సబందిత శాఖకు విడుదల చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పధకానికి జౌళి, చేనేత శాఖ నోడల్ ఏజన్సీగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.