తెలంగాణ ఉద్యమకారుడు, 22 ఏళ్ళుగా టిఆర్ఎస్‌లో పనిచేస్తున్న సీనియర్ నేత, ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు కుడిభుజంగా పేరొందిన కన్నెపల్లి రాజయ్య యాదవ్ ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ సాధన కోసం నేను కేసీఆర్‌తో కలిసి ఉద్యమాలలో పాల్గొన్నాను. నిరాహారదీక్షలు చేశాను. చివరికి అందరం కలిసి తెలంగాణ సాధించుకొన్నామని ఎంతగానో సంతోషించాము. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. పదవీ, అధికార వ్యామోహం పెరిగిపోయింది. కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసం అందరినీ నిర్ధాక్షిణ్యంగా తొక్కి పడేశారు. బాంచెన్ దొర అంటూ తన కాళ్ళు మొక్కుతున్నవారికి, ఉద్యమాన్ని వ్యతిరేకించినవారికీ పదవులు కట్టబెడుతున్నారు.
ఉద్యమకారులందరినీ ఒకరొకరిగా బయటకు పంపించేయడమో లేదా పొగబెట్టి వారే బయటకు వెళ్ళిపోయేలా చేయడమో చేశారు. నా వంటి ఒకరిద్దరు మంచి చెప్పబోతే మీడియాలో దుష్ప్రచారం చేయించి మా వ్యక్తిత్వాన్ని, పేరుప్రతిష్టాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. కనుక నా ఆత్మగౌరవం కోసమే పార్టీని వీడుతున్నాను. ఇది చాలా బాధాకరమే కానీ పార్టీలో ఉంటే ఇంకా ఇంకా అవమానాలు భరించాల్సి ఉంటుంది కనుక రాజీనామా చేసి బయటకు వచ్చేశాను.
పార్టీలో కొందరు నేతలు వాపును చూసి బలుపు అనుకొంటూ చాలా మిడిసిపడుతున్నారు. కానీ ఎల్లకాలం ఒక్కలాగే ఉందని వారు గ్రహించినట్లు లేదు. అహంకారంతో మిడిసిపడే పార్టీలు నేతలు, ఎంతో మంది చరిత్రలో కనబడకుండా కొట్టుకుపోయారు. టిఆర్ఎస్ తీరు మార్చుకోకపోతే దానికీ అదే గతి పడుతుంది.
టిఆర్ఎస్‌లో ఆలాగే మరికొంతమంది క్షోభ అనుభవిస్తున్నారు. రాబోయే రోజుల్లో వారు కూడా పార్టీని వీడే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కనుక నావంటి వారందరూ టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బిజెపి వైపు చూస్తున్నారు. బిజెపి కూడా మాతో టచ్చులోనే ఉంది,” అని రాజయ్య చెప్పారు.