
ఆగస్ట్ 1వ తేదీ నుంచి తెలంగాణలో ఆధార్-ఓటర్ కార్డు అనుసంధానం ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్-ఓటర్ కార్డు అనుసంధానం ప్రక్రియ కొరకు అన్ని జిల్లాల అవసరమైన ఏర్పాట్ల గురించి ఆయన నిన్న తన కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఆధార్-ఓటర్ కార్డు అనుసంధానం తప్పనిసరి కాదని, కానీ అనుసంధానం చేసుకొన్నట్లయితే దొంగ ఓట్లను నివారించవచ్చు కనుక ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వికాస్ రాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఒకే ఫోటో గుర్తింపు ఉన్న 10,25,987 డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించామని తెలిపారు. ఆగస్ట్ 1వ తేదీ నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.