ఆకస్మికంగా ఢిల్లీ వెళ్ళిన సిఎం కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం సాయంత్రం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 9.45 గంటలకు ఢిల్లీకి చేరుకొన్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు జోగినిపల్లి సంతోష్ కుమార్, జి.రంజిత్ రెడ్డి, టిఆర్ఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్‌ రెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లారు. సిఎం కేసీఆర్‌ బృందం అక్కడ మూడు రోజులు బస చేయనుంది. 

సిఎం కేసీఆర్‌ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఆ తరువాత కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబందించిన సమస్యలపై చర్చించనున్నారు. అయితే సోమవారం రాత్రి వరకు రాష్ట్రపతి ముర్ముతో సహా ఎవరి అపాయింట్‌మెంట్స్ లభించలేదని తెలుస్తోంది. 

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ నగరానికి వచ్చిన ప్రతీసారి మొహం చాటేస్తూ, ప్రధాని మోడీ అసమర్ధుడు, ఆయన వలన దేశానికి చాలా నష్టం జరుగుతోందంటూ సిఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో ద్రౌపదీ ముర్ముని కాదని ఆమెపై పోటీ చేసిన విపక్ష అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు టిఆర్ఎస్‌ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు అందరూ చాలా బిజీగా ఉన్నారు. కనుక సిఎం కేసీఆర్‌కు ఈసారి ఎవరివైనా అపాయింట్మెంట్స్ అయినా లభిస్తాయో లేదో తెలీని పరిస్థితి. 

విపక్ష ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా మార్గరెట్ ఆల్వా ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలో విపక్ష పార్టీల సమావేశం జరుగనుంది. ఎన్సీపీ అధినేత శరత్ పవార్ సిఎం కేసీఆర్‌ను ఆ సమావేశానికి ఆహ్వానించారు కానీ ఆ సమావేశానికి కాంగ్రెస్‌ ప్రతినిధులు కూడా హాజరుకానున్నందున సిఎం కేసీఆర్‌ దానికీ హాజరుకాకపోవచ్చు. 

ఈ మూడు రోజుల పర్యటనలో సిఎం కేసీఆర్‌ కేంద్ర ఎన్నికల కమీషన్‌ను కలిసి తన జాతీయపార్టీ రిజిస్ట్రేషన్ వ్యవహారాలను పూర్తి చేసుకొనే ప్రయత్నం చేసి, ఢిల్లీలో టిఆర్ఎస్‌ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించవచ్చు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మీడియా సమావేశం నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వ విధానాలపై మళ్ళీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలలో తన ప్రవేశంపై సిఎం కేసీఆర్‌ స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉంది.