కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవు-పులి కధ

నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తిచేసుకొని, దానికి అవసరమైన ‘మహోల్ ‘ సృష్టించే పని మొదలుపెట్టారు. ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి వచ్చిన తరువాత సిఎం కేసీఆర్‌ భయంతో వణికిపోతున్నారని, అందుకే తాను బిజెపిలో చేరబోతున్నానంటూ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తూ, తన అనుచరులను గందరగోళపరచడానికి ప్రయత్నిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కానీ తాను కేసీఆర్‌ ఉచ్చులో చిక్కుకొనని చెప్పారు. మునుగోడు ప్రజలు, తన అనుచరులు కోరితే తక్షణం పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని అన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్లు వార్తలు రాగానే సిఎం కేసీఆర్‌ హడావుడిగా జిల్లాలో గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారని అన్నారు. గజ్వేల్, సిరిసిల్లా, సిద్ధిపేట జిల్లాల మాదిరిగా మిగిలిన జిల్లాలు కూడా అభివృద్ధి చెండాలంటే ఉపఎన్నికలు అవసరమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారు. సాధుజంతువు ఆవు వంటి కాంగ్రెస్ పార్టీని చంపేసి, పులి వంటి బిజెపిని తెచ్చుకొన్నారని, అది ఏదో రోజు కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ పార్టీని మింగేయడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ... అధ్యక్షురాలు సోనియాగాంధీ అంటే తనకు చాలా అభిమానమని అందుకే అవమానాలు భరిస్తూ ఇంకా పార్టీలో కొనసాగుతున్నానని అన్నారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం కొన్ని పొరపాటు చేస్తోందని తెలంగాణ ఉద్యమాలతో సంబందం లేనివారిని జైలుకి వెళ్ళివచ్చిన (రేవంత్‌ రెడ్డి)వంటివారికి పదవులు కట్టబెట్టి చిరకాలంగా పార్టీనే నమ్ముకొని ఉన్న తనవంటి కాంగ్రెస్‌ నేతలను వారి కింద పనిచేయాలని ఆశిస్తోందని, ఇది సరికాదన్నారు. అయినా జైలుకి వెళ్ళివచ్చినవారి కింద తాను పనిచేయలేనని చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించే పార్టీకే తన మద్దతు అని ఎప్పుడో చెప్పానని ఇప్పుడూ దానికే కట్టుబడి ఉన్నానని అన్నారు. రాష్ట్రంలో బిజెపికి మాత్రమే ఆ శక్తి ఉందని నమ్ముతున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.