
హైదరాబాద్ బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లైఓవర్‌కు రూ.130 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్ గడ్కారీ మంగళవారం ట్వీట్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ నుంచి ప్రతీరోజూ వేలాది సరుకు రవాణా వాహనాలు బీహెచ్ఈఎల్ మీదుగా సంగారెడ్డి, జహీరాబాద్, నాగ్‌పూర్, పూణే, ముంబైలకు వెళుతుంటాయి. అదేవిదంగా ఆయా నగరాల నుంచి కూడా హైదరాబాద్‌కు సరుకులు తీసుకువస్తుంటాయి. కనుక బీహెచ్ఈఎల్ వద్ద నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. దీనివలన నిత్యం బీహెచ్ఈఎల్ మీదుగా రాకపోకలు సాగించే నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన బీహెచ్ఈఎల్ వద్ద 1.65 కిమీ పొడవున ఫ్లైఓవర్ నిర్మించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 29న శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.130 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 2024 డిసెంబరులోగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కనుక ఆలోగా దీని నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.