తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిఎం కేసీఆర్ కాంగ్రెస్, టిడిపిల ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను టిఆర్ఎస్‌లోకి రప్పిచి వాటిని దెబ్బతీస్తే, ఇప్పుడు టిఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొంటూ టిఆర్ఎస్‌కు షాక్ ఇస్తోంది. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనను వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మల్లిఖార్జున ఖర్గే చేత కాంగ్రెస్ కండువా కప్పించి పార్టీలో చేర్చుకొన్నారు. ప్రవీణ్ రెడ్డి మొదట కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. 2009 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ 2014 ఎన్నికలలో ఓడిపోయిన తరువాత టిఆర్ఎస్‌లో చేరారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకొన్నారు. ఈ మద్య కాలంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి, మరికొందరు టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో చాలా మంది టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని రేవంత్ రెడ్డి చెపుతున్నారు. కనుక మున్ముందు ఇంకెవరూ కాంగ్రెస్ గూటిలోకి వస్తారో చూడాలి.