
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఈరోజు మళ్ళీ సవాలు విసిరారు. వచ్చే ఎన్నికలలో తెరాసయే తిరుగులేని మెజార్టీతో గెలుస్తుందని గొప్పలు చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్, దమ్ముంటే ముందు నల్గొండ జిల్లాలో పార్టీ మారిన కాంగ్రెస్ నేతల చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు నిర్వహించి వారిని గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. ఒకవేళ ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధులు గెలిస్తే తాను 2019 ఎన్నికలలో పోటీ చేయనని కోమటిరెడ్డి శపధం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తనకి అనుకూలంగా సర్వేలు చేయించుకొని తృప్తి పడితే తమకేమీ అభ్యంతరం లేదని కానీ ఆ సర్వేలు నల్గొండలో మాత్రం తప్పవుతాయని అన్నారు. జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులే ఘన విజయం సాధిస్తారని కోమటిరెడ్డి పూర్తి నమ్మకంగా చెప్పారు.
తెరాస సర్కార్ విద్యా, వైద్య రంగాలని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అలాగే సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చాలా బారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు అన్నీ నేటికీ ఆంధ్రా పారిశ్రామికవేత్తల చేతిలోనే ఉండిపోయాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా వారికే అన్నీ కట్టబెడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. అసలు ఈ రెండేళ్ళలో కెసిఆర్ ప్రభుత్వం ఒక్క హామీ, ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేసిందా? అని ప్రశ్నించారు. మరి అటువంటప్పుడు తెరాసకి ఏమి చూసి ప్రజలు ఓట్లేస్తారని కెసిఆర్ అనుకొంటున్నారు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.