5.jpg)
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే వచ్చే శాసనసభ ఎన్నికలలో కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలవాలని మంత్రి కేటీఆర్ విసిరిన సవాలుపై బండి సంజయ్ స్పందించారు. శుక్రవారం కరీంనగర్‌లో హోలీ ఉత్సవాలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్ మాదిరిగా మాది ఏక్ నిరంజన్ పార్టీ కాదు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే మేము పోటీ చేస్తాము తప్ప ఎవరో సవాళ్ళు విసిరారని వారు చెప్పిన చోట నుంచి పోటీ చేయలేము. గత లోక్‌సభ ఎన్నికలలో నేను ప్రజల ఆశీసులతో లక్ష ఓట్ల భారీ మెజార్టీతో గెలిచాను. అంత మెజార్టీతో గెలిస్తే మంత్రి కేటీఆర్ నేను గాలివాటంగా గెలిచానని చెప్పడం చాలా తప్పు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మరో ఆరోపణ చేశారు. కానీ ఆ ప్రాజెక్టుకి సంబందించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డిపిఆర్) ఇంతవరకు కేంద్రానికి ఎందుకు ఇవ్వలేదు?కనీసం డిపిఆర్ ఇవ్వకుండా దానికి జాతీయహోదా ఇమ్మని అడిగితే ఎలా? స్మార్ట్ సిటీ పధకంలో భాగంగా కేంద్రం ఇచ్చిన నిధులతోనే కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు మీరు శంఖుస్థాపనలు చేస్తూ మళ్ళీ కేంద్రాన్ని నిందించడం మీకే చెల్లు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పనులన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతో చేపడుతున్నారో లేక రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్నారో చెప్పాలి,” అని అన్నారు.
కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్‌పై పోటీ చేయాలనే మంత్రి కేటీఆర్ సవాలుకి బండి సంజయ్ చాలా లౌక్యంగా జవాబు చెప్పి తప్పించుకొన్నారని అర్దమవుతోంది. కానీ బండి సంజయ్ గంగులపై పోటీ చేసి గెలవలేరనుకొంటే ఇక రాష్ట్రంలో బిజెపిని ఎలా గెలిపించుకోగలరు? తెలంగాణలో ఎలా అధికారంలోకి రాగలరు?