52.jpg)
సిఎం కేసీఆర్ నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుకళ్యాణ మహోత్సవంలో సిఎం కేసీఆర్ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించుకొంటారు. అనంతరం ఈ నెల 21 నుంచి జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం, ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేస్తారు.
చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ అనే సంస్థ దాతల సాయంతో స్వామివారి స్వర్ణరధం తయారుచేసి, యాదాద్రికి దాని విడి భాగాలు పంపించింది. యాదాద్రిలో వాటిని బిగించి గురువారం రాత్రి నుంచి రధానికి బంగారు తొడుగులు బిగించడం ప్రారంభించారు. అలాగే యాదాద్రి ప్రధానాలయం రాజగోపురాలపై స్వర్ణ కలశాలను బిగించే పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆలయ అష్టభుజి శిఖర మండపాలపై రాగి కలశాలు ప్రతిశించారు. గురువారం పంచతల రాజగోపురంపై తొమ్మిది బంగారు కలశాలను శిల్పులు బిగించారు. నేడు సిఎం కేసీఆర్ ఆ స్వర్ణ రధాన్ని, బంగారు కలశాలను కూడా పరిశీలిస్తారు.