
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడే వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. దీని కోసం ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించిన తరువాత ఈవీఎంలను తెరిచి ఓట్ల లెక్కిస్తారు.
ఐదు రాష్ట్రాలలో 403 శాసనసభ స్థానాలున్న అతిపెద్ద రాష్ట్రం యూపీ చాలా కీలకమైనది. ఇక్కడ మళ్ళీ బిజెపియే అధికారంలోకి రావచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. అయితే ఈసారి సమాజ్‌వాదీ పార్టీ బిజెపికి గట్టి పోటీనివ్వడంతో అది కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది.
యూపీ తరువాత పంజాబ్, గోవా రాష్ట్రాల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకాలం ఢిల్లీకే పరిమితమైన ఆమాద్మీ పార్టీ ఈసారి పంజాబ్ ఎన్నికలలో సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. బిజెపి కూడా ఎన్నికలలో గెలిచి అధికారం నిలుపుకొనేందుకు గట్టిగా కృషి చేసింది. మళ్ళీ ఎలాగైనా పంజాబ్‌లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ప్రయత్నించింది. అయితే ఈసారి ఆమాద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. కానీ మూడు పార్టీల మద్య త్రిముఖపోటీ వలన హంగ్ ఏర్పడే అవకాశం కూడా ఉందని సూచించాయి. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలున్నందున ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 59 మంది ఎమ్మెల్యేలు అవసరం.
గోవాలో కాంగ్రెస్, బిజెపిలు చాలా తీవ్రంగా పోటీ పడటంతో హంగ్ ఏర్పడే అవకాశం కూడా ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. కనుక అప్పుడే పార్టీల బేరసారాలు, క్యాంప్ రాజకీయాలు మొదలైపోయాయి. గోవా(40)లో ప్రభుత్వ ఏర్పాటుకి 21 మంది ఎమ్మెల్యేలు అవసరం.
ఉత్తరాఖండ్ (70 ), మణిపూర్ (60) రాష్ట్రాలలో మళ్ళీ బిజెపియే అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
మధ్యాహ్నం 1-2 గంటలలోపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.