
ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయలేదంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తూ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తుండేవి. కానీ ఇవాళ్ళ సిఎం కేసీఆర్ శాసనసభలో 80,090 ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించిన తరువాత ప్రతిపక్షాలు కొత్త పల్లవి అందుకొన్నాయి.
సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనను నేను స్వాగతిస్తున్నాను. అయితే టిఆర్ఎస్ 2018 ఎన్నికల తరువాత అధికారంలోకి రాగానే రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఒక్కొక్కరికీ రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు దానిని అమలుచేయలేదు. బడ్జెట్లో కూడా ఆ ప్రస్తావన లేదు. అంటే నిరుద్యోగ భృతి ఇచ్చే ఉద్దేశ్యం లేదనుకోవాలా?ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారు గనుకనే నిరుద్యోగులలో తమ ప్రభుత్వం, పార్టీ పట్ల వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసమే సిఎం కేసీఆర్ ఇప్పుడు హటాత్తుగా ఉద్యోగాల భర్తీకి సిద్దపడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలలోగా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముగించి ఎంపికైన వారందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారని ఆశిస్తున్నాం,” అని అన్నారు.
సిఎం కేసీఆర్ తన వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న మాటలను వి.హనుమంతరావు తప్పు పట్టారు. “తెలంగాణ ప్రజలందరి పోరాటాలు, త్యాగాల వలననే తెలంగాణ ఏర్పడింది తప్ప ఒక్క కేసీఆర్ వల్ల కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని,” వి.హనుమంతరావు అన్నారు.