నేటి నుంచే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ: కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ ఈరోజు శాసనసభ ఉద్యోగాల భర్తీపై నిర్ధిష్టమైన ప్రకటన చేశారు. కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు, పదోన్నతులు అన్ని పూర్తయిన తరువాత రాష్ట్రంలో అన్ని శాఖలలో కలిపి 91,142 ఖాళీలు ఉన్నాయని వాటిలో 80,039 పోస్టులకు నేటి నుంచే నోటిఫికేషన్లు జారీ చేయడం మొదలవుతుందని ప్రకటించారు. ఒక్క విద్యాశాఖలోనే సుమారు 25 వేలకు పైగా ఖాళీలు భర్తీ చేయబోతున్నట్లు సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇవి కాక 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్రప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు సహకరించకపోవడం వలన, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో ఉద్యోగాల పంచాయతీల కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంత ఆలస్యమైందని సిఎం కేసీఆర్‌ తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం అటెండర్ మొదలు ఆర్డీవో పోస్టు వరకు అన్ని ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకే దక్కుతాయని సిఎం కేసీఆర్‌ తెలిపారు. మిగిలిన 5 శాతం ఓపెన్ కేటగిరీలో కూడా స్థానికులు పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకొనే అవకాశం ఉందని తెలిపారు.