
తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సస్పెన్షన్‌కు గురైన బిజెపి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ ముగ్గురూ స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈరోజు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సభలో నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలాగా మారారని వారు ఆరోపించారు. తమపై సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు వేయడం రాజ్యాంగ విరుద్దమని, కనుక సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేసి మళ్ళీ తమను శాసనసభ సమావేశాలలో పాల్గొనేలా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించాలని వారు తమ పిటిషన్లలో కోరారు. అసలు తమను ఎందుకు ఏ నిబందనల ప్రకారం సస్పెండ్ చేశారో కోర్టుకు తెలియజేయాలని, వాటికి సంబందించిన వీడియో రికార్డును కూడా సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని వారు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అప్పటి స్పీకర్‌ను ఆదేశించిన సంగతిని రఘునందన్ రావు తన పిటిషన్లో హైకోర్టుకు గుర్తు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే తాము రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను, తరువాత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
అయితే ఈసారి మార్చి 15వరకు ఏడు రోజులు మాత్రమే శాసనసభ సమావేశాలు జరుగుతాయి. కనుక హైకోర్టు విచారణ పూర్తయ్యి తీర్పు వెలువరించేలోగా సమావేశాలు ముగిసిపోయే అవకాశం ఉంది.