కాశీలో కేసీఆర్‌కు స్వాగతం చెపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు

అవును..ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెనారస్ నియోజకవర్గంలోనే...తెలంగాణ సిఎం కేసీఆర్‌కు స్వాగతం చెపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. సిఎం కేసీఆర్‌ బృందం శుక్రవారం కాశీలో పర్యటించనున్నారు. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొన్న తరువాత సిఎం కేసీఆర్‌ బనారస్‌లో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా, బిజెపికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. కనుక ఆయనకు స్వాగతం చెపుతూ కాశీలోని అన్ని ప్రధాన కూడళ్ళలో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటిలో సిఎం కేసీఆర్‌ ఫోటోలతో పాటు మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే, దేవగౌడ, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, శరత్ పవార్, సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ ఫోటోలను వాటి కింద రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోటోలను ముద్రించారు. ‘దేశ్ కా నేత కేసీఆర్‌కి స్వాగతం’ అంటూ వ్రాశారు.  

ఇవాళ్ళ యూపీలో 6వ విడత పోలింగ్ జరుగుతోంది. మళ్ళీ ఈ నెల 7వ తేదీన తుది విడత పోలింగ్ జరుగనుంది. సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు కనుక మోడీ నియోజకవర్గంలోనే ఎన్నికల ప్రచారం చేసి సవాలు విసురబోతున్నారు. మంచి మాటకారి అయిన సిఎం కేసీఆర్‌ హిందీ, ఉర్దూ భాషలలో కూడా అనర్గళంగా మాట్లాడగలరు కనుక కాశీలో ఎన్నికల ప్రచారం ద్వారా అక్కడి ప్రజలపై కూడా తన ప్రభావం చూపగలిగితే ఇక ఆయనకు తిరుగే ఉండదు.