4.jpg)
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రజాసంగ్రామ యాత్రను పునః ప్రారంభించబోతున్నారు. మొదటిసారి 36 రోజులు పాదయాత్ర చేసి విరమించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ప్రారంభించి వికారాబాద్ జిల్లా వరకు యాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది.
బర్కత్‌పురాలోని బిజెపి కార్యాలయంలో బండి సంజయ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో బిజెపి ఉనికి లేదని సిఎం కేసీఆర్ జనగామ సభలో అన్నారు. ఈ నెలాఖరున అక్కడే బహిరంగ సభ పెట్టి మన సత్తా ఏమిటో ఆయనకు చూపుదాము. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినవారిని పోలీసులు వేధిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కాపాడటానికి సిఎం కేసీఆర్ శతవిదాల ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో బిజెపికి క్రమంగా బలపడుతుండటంతో వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే సిఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకొన్నారు. కానీ టిఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరు. బిజెపి గెలుపును ఆపలేరు,” అని అన్నారు.
రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ, “హుజూరాబాద్ ఓటమి తరువాత సిఎం కేసీఆర్‌కు భయం పుట్టుకొంది. కేసీఆర్ మొహంలో ఆ భయం స్పష్టంగా కనబడుతోంది. అందుకే ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకొన్నారు. అయితే ఆయన ఎంతమంది పీకేలను తెచ్చుకొన్నా వాళ్ళ వలన బిజెపికి వచ్చే నష్టం ఏమీ లేదు. నిజానికి మా బూత్ స్థాయి ప్రతీ కార్యకర్త పీకేతో సమానమే. సిఎం కేసీఆర్ రాష్ట్రాన్ని గాలికొదిలేసి పోలిటికల్ టూరిస్టులా దేశం పట్టుకొని తిరుగుతున్నారు. ఆయన ఎవరిని కలిసినా, ఆయనతో ఎవరు కలిసినా బిజెపిని ఏమీ చేయలేరు. సిఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారు. అవి ఎలాగూ పగటి కలలే కనుక ఆయన రష్యా లేదా ఉక్రెయిన్‌కు కూడా ప్రధాని కావచ్చు,” అని ఎద్దేవా చేశారు.