నేడు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్ ఖరారు

సిఎం కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో నగరంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ అధికారులతో సమావేశం కానున్నారు. దీనిలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను ఎప్పటి నుంచి ఎప్పటివరకు నిర్వహించాలనే అంశంపై చర్చించి షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. 

ఈసారి 10-12 రోజులు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు సిఎం కేసీఆర్‌ ఇది వరకే చెప్పారు. వీలైతే వచ్చే నెలాఖరులోగా హైదరాబాద్‌లో కాంగ్రెస్‌, బిజెపియేతర పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. అదీగాక మార్చి 28న యాదాద్రిలో జరుగబోయే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సిఎం కేసీఆర్‌ పాల్గొనబోతున్నారు. కనుక ఆలోపుగానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించవచ్చు. 

ఈసారి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు దళిత బంధు పధకానికి ప్రకటిస్తానని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అలాగే కరోనా కారణంగా ఆలస్యమైన నిరుద్యోగ భృతి హామీని కూడా త్వరలోనే అమలుచేస్తామని హామీ ఇచ్చారు. కనుక ఈసారి బడ్జెట్‌లో ఈ రెంటికీ నిధులు కేటాయించే అవకాశం ఉంది.