జగ్గారెడ్డి రాజీనామా సీజన్2-ఎపిసోడ్2

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా కధ వెబ్‌ సిరీస్‌లాగ కొనసాగుతూనే ఉంది. వారం రోజుల క్రితం ‘నా వల్లే మీకు ప్రాబ్లెమ్ అయితే నేను వెళ్ళిపోతానంటూ..’ డైలాగ్స్ చెప్పిన జగ్గారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకొంటానని చెపుతూ సీజన్-2లో రెండో ఎపిసోడ్ ప్రారంభించారు. 

ఆయన నిన్న సంగారెడ్డిలో తన అనుచరులతో సమావేశమై ‘కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలా లేక రాజీనామా చేయాలా లేదా బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకోవాలా?’ అని చర్చించారు. వారిలో చాలామంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరడంతో ప్రస్తుతానికి రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. 

నేను టిఆర్ఎస్‌ లేదా బిజెపిలో చేరేందుకే రాజీనామా చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను కాంగ్రెస్‌ వీడి బయటకు వస్తే ఏ పార్టీలోను చేరనని, అవసరమైతే కొత్త పార్టీ పెట్టుకొంటానని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఒకవేళ పార్టీలో ఇవే పరిస్థితులు ఇంకా కొనసాగితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకొంటానని జగ్గారెడ్డి అన్నారు.