వాహనదారులకు శుభవార్త!

తెలంగాణలోని వాహన యజమానులకు ఓ శుభవార్త! సిగ్నల్ జంప్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా బైక్, స్కూటీలు నడపడం, కార్లో సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం, మద్యం త్రాగిడ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి వివిద కారణాలతో చలాన్లు చెల్లించవలసినవారు తమ వాహనాలపై జారీ అయిన పెండింగ్ చలాన్లను మొత్తం చెల్లిస్తే 75 శాతం వరకు రాయితీ లభించబోతోంది.

రాష్ట్రంలో తిరుగుతున్న వివిద వాహనాలపై రూ.6.18 కోట్లు రావలసి ఉంది. దానిని రాబట్టుకొనేందుకు ట్రాఫిక్ పోలీస్ విభాగం రాయితీని ఇవ్వాలని నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ద్విచక్రవాహనాలకు, ఆటో రిక్షాలకు చెల్లించవలసిన మొత్తంలో 75 శాతం, కార్లు, జీపులు వగైరా నాలుగు చక్రాల వాహనాలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించింది. మార్చి 1 నుంచి నెలాఖరు వరకు దీనిని అమలుచేయాలని నిర్ణయించింది. వాహనదారులు ఈ రాయితీని ఉపయోగించుకొని పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు వీలుగా సంబందిత అధికారులు చలాన్ వెబ్‌సైట్‌లో అవసరమైన మార్పులు చేశారు. పెండింగ్ చలాన్లను ఆన్‌లైన్‌లో, మీ సేవా కేంద్రాలలో చెల్లించవచ్చు. ఒకటి రెండు రోజుల్లో ఈ రాయితీలపై ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారిక ప్రకటన చేయనుంది.