
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయాన్ని సిఎం కేసీఆర్ నేడు ప్రారంభోత్సవం చేయనున్నారు. సిఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో తుక్కాపూర్ చేరుకొంటారు. అక్కడ భూగర్భంలో ఏర్పాటు చేసిన పంప్‌హౌస్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తరువాత మోటర్లు ఆన్‌చేసి మల్లన్నసాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తారు. తరువాత జలాశయంలో గోదావరి నీటికి పూజలు చేస్తారు. ఇప్పటికే పంప్‌హౌస్ ట్రయల్ రన్స్ విజయవంతంగా ముగియడంతో సిఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రాజెక్టు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మల్లన్న సాగర్ జలాశయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీని చుట్టుపక్కల ఎక్కడా నది లేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానించి 50 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను 90 మీటర్ల ఎత్తు నుంచి 665 మీటర్ల ఎత్తున ఉండే మల్లన్నసాగర్‌కి తీసుకువచ్చారు. ఆసియా ఖండంలో కెల్లా అతి పెద్ద సర్జ్‌పూల్ పూల్ ఇది. మల్లన్నసాగర్ 557 పూర్తి సామర్ధ్యం 50 టీఎంసీలు కాగా డెడ్ స్టోరేజి 10 టీఎంసీలు ఉండేలా నిర్మించారు. మల్లన్నసాగర్ చాలా ఎత్తులో ఉన్న జలాశయం కనుక ఇక్కడి నుంచి మెదక్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు గ్రావిటీ పద్దతిలో కాలువల ద్వారా సులువుగా నీటిని తరలించవచ్చు. ఒక్క మల్లన్నసాగర్ కిందే 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
మల్లన్నసాగర్ ఆనకట్టకు 5 తూములు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కొండపోచమ్మ, గందమల్ల జలాశయం, సింగూర్ ప్రాజెక్టు, తపాస్ పల్లి జలాశయాలకు గోదావరి జలాలను తరలిస్తారు. వాటి ద్వారా మిషన్ భగీరధకు కూడా నీటిని అందజేస్తారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు నీళ్ళు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు నీళ్ళు దీని ద్వారానే ఏడాది పొడవునా అందజేస్తారు.