
జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయాలనే సిఎం కేసీఆర్ ప్రయత్నాలకు తొలిసారిగా మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రే నుంచి పూర్తి మద్దతు లభించింది. సిఎం కేసీఆర్ బృందం నిన్న ప్రత్యేక విమానంలో ముంబై వెళ్ళి థాక్రేతో సుమారు 3 గంటలు భేటీ అయ్యింది. జాతీయ రాజకీయాలు, కేంద్రప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు, బిజెపితో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సుదీర్గంగా చర్చించారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి సంయుక్త ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రే మీడియాతో మాట్లాడుతూ, “జాతీయ రాజకీయాల గురించి చర్చించేందుకు సిఎం కేసీఆర్ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం కలిగించింది. తెలంగాణ, మహారాష్ట్ర రెండూ సోదర రాష్ట్రాలవంటివి. ఇప్పటికే రెండు రాష్ట్రాలు సాగునీరు, ఐటి తదితర రంగాలలో పరస్పరం సహకరించుకొంటున్నాయి. ఇకపై రాజకీయంగాను సహకరించుకొంటాము. మా సమావేశంలో రహస్య అజెండా ఏమీ లేదు. మేము ఏమి చేసినా బహిరంగంగానే చేస్తాం. సిఎం కేసీఆర్ నన్ను హైదరాబాద్‌లో నిర్వహించబోయే సమాశంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. నేను తప్పకుండా దానికి హాజరవుతాను. బిజెపిని అడ్డుకొనేందుకు కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగుతాం. సిఎం కేసీఆర్ మొదలుపెట్టిన ఈ పోరాటానికి మేము పూర్తి మద్దతు ఇస్తాం,” అని అన్నారు.
సిఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, సంతోష్ కుమార్, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.