
నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో ఈరోజు ఉదయం టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు పరస్పరం రాళ్ళతో కొట్టుకొన్నారు. బిజెపి అధ్వర్యంలో దర్పల్లిలో కొత్తగా ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసారు. ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని ఇవాళ్ళ శివాజీ విగ్రహావిష్కరణ చేసేందుకు బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ రావలసి ఉంది.
ఈ విషయం తెలుసుకొన్న టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకొని ఈ కార్యక్రమానికి తమ ఎమ్మెల్యే బాజిరెడ్డిని, స్థానిక ప్రజా ప్రతినిధులను ఎందుకు ఆహ్వానించలేదని బిజెపి కార్యకర్తలను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మద్య వాదోపవాదాలు మొదలై చివరికి పరస్పరం రాళ్ళు రువ్వుకొన్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారి రాళ్ళ దాడిలో ఎస్సై వంశీ కృష్ణ, ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు. అయినప్పటికీ పోలీసులు సంయమనం పాటిస్తూ ఇరువర్గాలను శాంతింపజెసేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా విగ్రహానికి చెరోవైపు బైటాయించి ఎదుటపార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో దర్పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.