
ఇక నుంచి సిఎం కేసీఆర్ పుట్టిన రోజు ఫిబ్రవరి 17వ తేదీని నిరుద్యోగదినంగా నిర్వహిస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు మాయమాటలు చెపుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి వేసారిపోయిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే టిఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు సిఎం కేసీఆర్ పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలియజేయాలనుకొంటే పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేయించి అడ్డుకొన్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నిరుద్యోగుల సమస్యల గురించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.90 లక్షల పోస్టులు భర్తీ చేసేవరకు ఇక నుంచి ఏటా ఫిబ్రవరి 17వ తేదీన నిరుద్యోగదినంగా పాటిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.