ఓయూలో కర్రలతో దాడులు చేసుకొన్న విద్యార్దులు

ఉస్మానియా యూనివర్సిటీలో టీజీవిఎఫ్ మరియు బిఎస్పీ అనుబంద సంఘానికి చెందిన కొందరు విద్యార్దులు ఈరోజు సిఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. వెంటనే టిఆర్ఎస్‌ అనుబంద సంఘం విద్యార్ధులు అక్కడకు చేరుకొని వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో ఇటువర్గాల మద్య ఘర్షణ మొదలై చివరికి ఒకరినొకరు కర్రలతో కొట్టుకొన్నారు. వెంటనే పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టి, కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్దులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  

నేడు సిఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు వేడుకలు జరుపుకోవాలని టిఆర్ఎస్‌ పిలుపునివ్వడంతో ఉస్మానియాలోని టీజీవిఎఫ్ మరియు బిఎస్పీ అనుబంద సంఘాల నేతలు భగ్గుమన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే, సిఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఏమిటని టీజీవిఎఫ్ అధ్యక్షుడు సురేష్ యాదవ్ ప్రశ్నించారు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే ఓయూ ఆవరణలోనే ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనందుకు నిరసనగా టీజీవిఎఫ్ విద్యార్దులు ఈరోజు ఉదయం ఓయూ లైబ్రెరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సిఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి దానిని దగ్ధం చేస్తుంటే టిఆర్ఎస్‌ అనుబంద సంఘం విద్యార్ధులు అడ్డుకోవడంతో పరస్పరం కర్రలతో దాడులు చేసుకొన్నారు.