రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బుదవారం నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసి బాన్సువాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశాన్ని పాలించమని ప్రజలు మోడీకి అధికారం కట్టబెడితే ఏమి చేశారు? ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ వరుసగా అమ్మిపడేస్తూ వాటిలో ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారు. ఎప్పుడూ మతాలపేరుతో ప్రజల మద్య చిచ్చుపెట్టడమే తప్ప దేశాన్ని అభివృద్ధి చేసుకొందామనే సోయి లేదు. తెలంగాణ ఏర్పడిన ఈ ఏడేళ్ళలో కేంద్రప్రభుత్వం పైసా విదిలించకపోయినా సిఎం కేసీఆర్ నేతృత్వంలో మనం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొన్నాము. దేశంలో ఇతర రాష్ట్రాలకు ఉన్నత విద్యాసంస్థలు, వైద్య కళాశాలలు, యూనివర్సిటీలు, నవోదయ పాఠశాలలు కేంద్రం ఇస్తుంది కానీ తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వదు.
అసలు తెలంగాణ అంటే ప్రధాని నరేంద్రమోడీకి, బిజెపి నేతలకు ఎందుకు ఇంత కక్షో అర్ధం కాదు. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే భాగమని భావిస్తున్నారా లేదా? అనే అనుమానం కలుగుతుంది. రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా ఏడేళ్ళ తరువాత కూడా ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పుట్టుకను ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు...తెలంగాణ ప్రజల పోరాటాలను, బలిదానాలను అపహాస్యం చేస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలోని బిజెపి ఎంపీలు, నేతలు కూడా తెలంగాణ కోసం ఏమీ చేయకపోగా అడుగడుగునా ప్రభుత్వానికి అడ్డుపడుతూనే ఉన్నారు. సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. కనుక బిజెపి నేతల మాయమాటలు నమ్మకుండా తెలంగాణకు ఎవరు మేలు చేస్తున్నారు? ఎవరు కీడు చేస్తున్నారు?అని ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బిజెపి నేతలు వస్తే తెలంగాణకు ఏమి చేశారని గట్టిగా నిలదీసి అడగాలి. పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి అభివృద్ధి చేసుకొంటున్నాము. దానిని బిజెపి చేతిలో పెడితే మళ్ళీ ఏపీలో కలిపేసే ప్రమాదం ఉంది. కనుక ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరుతున్నాను,” అని అన్నారు.