
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఆయన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశ్యించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం, వాటిపై తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తుండటం అందరికీ తెలిసిందే. తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా వాటిని తీవ్రంగా ఖండించారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలందరూ అస్సాం ముఖ్యమంత్రిపై జిల్లాలలో పోలీసులకు పిర్యాదులు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని తప్పు పడుతూ మళ్ళీ ఇవాళ్ళ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తున్నారు.
అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సిఎం కేసీఆర్ అంత తీవ్రంగా ఖండించినప్పుడు, మరి పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయడం లేదు? కాంగ్రెస్ శ్రేణులలో అయోమయం సృష్టించేందుకే సిఎం కేసీఆర్ రాహుల్ గాంధీని వెనకేసుకువస్తూ మాట్లాడారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈవిషయంలో సిఎం కేసీఆర్కు చిత్తశుద్ది ఉంటే తక్షణం తమ ఫిర్యాదుల ఆధారంగా అస్సాం ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఆందోళనలతో దిగివచ్చిన పోలీసులు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఇవాళ్ళ 504,505 క్లాజ్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇక్కడ అస్సాం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేస్తుంటే, అక్కడ అస్సాంలో కూడా ప్రధాని నరేంద్రమోడీని కించపరుస్తున్నట్లు మాట్లాడినందుకు సిఎం కేసీఆర్పై కేసులు నమోదు చేసేందుకు బిజెపి నేతలు సిద్దం అవుతున్నారు.