
కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని శపధం చేసిన తెలంగాణ సిఎం కేసీఆర్ ఆ దిశలో బిజెపిని వ్యతిరేకించే పార్టీలను కూడగడుతున్నారు. మొన్న పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడారు. ఈనెల 20న ముంబై వెళ్ళి మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రేతో భేటీ అయ్యి ఇదే అంశంపై లోతుగా చర్చించనున్నారు.
దేశంలో ఇంత గట్టిగా ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్రప్రభుత్వాన్ని ఎదిరించి ఏ ముఖ్యమంత్రి మాట్లాడటం లేదు. కనుక సిఎం కేసీఆర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రాష్ట్రాల హక్కులు, బిజెపి మార్క్ రాజకీయాలపై సిఎం కేసీఆర్ చేస్తున్న సునిశిత వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీని కలుపుకోకుండా బిజెపిని ఢీకొని ఓడించడం సాధ్యమేనా? ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలలో 40 నుంచి 80 లోక్‌సభ సీట్లున్నప్పుడు, కేవలం 17 లోక్‌సభ సీట్లున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఉత్తరాది రాష్ట్రాల నేతలు అంగీకరిస్తారా? అనే ప్రశ్నలకు భవిష్యత్‌లో సమాధానాలు లభిస్తాయి.