సిఎం కేసీఆర్‌ అబద్దాలు చెప్పడం తగదు: కేంద్రమంత్రి

రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో సిఎం కేసీఆర్‌ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్రాన్ని కూడా లాగుతుండటంతో కేంద్రమంత్రులు కూడా స్పందించక తప్పడంలేదు. సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని కానీ తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అందుకు అంగీకరించబోనని, రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఢిల్లీకి వెళ్ళి మరీ పోరాడుతానని హెచ్చరించారు. అలాగే సౌరవిద్యుత్ కేంద్రం సూచించిన కంపెనీల నుంచే కొనాలని ఒత్తిడి చేస్తోందని సిఎం కేసీఆర్‌ ఆరోపించారు.

కేసీఆర్‌ ఆరోపణలపై కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కె సింగ్‌ ఘాటుగా స్పందించారు. “సిఎం కేసీఆర్‌ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈవిదంగా మాట్లాడటం తగదు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని మేము ఏ రాష్ట్రంపై ఒత్తిడి చేయలేదు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ విద్యుత్ సరఫరాకు తరచూ బిడ్లు నిర్వహిస్తుంటుంది. దానిలో చాలా కంపెనీలు పాల్గొంటాయి. వాటిలో అతి తక్కువ ధరకు సోలార్ విద్యుత్ సరఫరా చేసేందుకు బిడ్ వేసిన కంపెనీల నుంచి రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు చేయవచ్చు లేదా సొంతంగా టెండర్లు పిలిచి విద్యుత్ కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం వినియోగిస్తున్న ధర్మల్ విద్యుత్ వలన కాలుష్యం పెరుగుతుంది కనుక 2050 నాటికల్లా ప్రపంచదేశాలన్నీ సోలార్, జల, వాయు తదితర ప్రత్యామ్నాయ పద్దతులకి మారాలని నిర్ణయించుకొన్నాయి. భారత్‌ కూడా అదే లక్ష్యంతో ముందుకుసాగుతోంది తప్ప రాష్ట్రాలపై ఒత్తిడి చేయడం లేదు. 

ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం పైసా ఇవ్వలేదని సిఎం కేసీఆర్‌ పదేపదే ఆరోపిస్తున్నారు. కానీ ఆ ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి జలవిద్యుత్ సంస్థలైన పవర్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ర్టిఫికేషన్ కార్పొరేషన్ రెండు సంస్థలు కలిసి రూ.55,000 కోట్లు రుణాలు అందించాయి. ఈ విషయం సిఎం కేసీఆర్‌కు తెలుసు కానీ ఆయన పైసా ఇవ్వలేదని అబద్దాలు చెపుతున్నారు,” అని అన్నారు.