
తెలంగాణలో కబ్జాలకు గురైన భూములను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై సంబందిత శాఖల అధికారులతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకొని సోమవారం జీవో ఎంఎస్ నంబర్: 14ను జారీ చేసింది. ఈ నెల 21 నుంచి మార్చి 31వరకు మీసేవా కేంద్రాల ద్వారా భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.
అయితే 2014, జూన్ 2 లేదా అంతకంటే ముందు నుంచి ఆయా స్థలాలలో ఇళ్ళు కట్టుకొని ఉంటున్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. క్రమబద్దీకరణకు తప్పనిసరిగా 2014 లేదా అంతకంటే ముందు నుంచి ఆ స్థలంలో నివాసం ఉంటున్నట్లు కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నల్లా కనెక్షన్ వంటి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు 125 చదరపు గజాల లోపు భూమిని ఉచితంగా క్రమబద్దీకరిస్తారు. 125-250 చదరపు గజాలకు రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతం, 250-500 చదరపు గజాలకు 75 శాతం, 500 చదరపు గజాల పైబడిన భూములకు 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కబ్జా చేసిన భూములను వాణిజ్య అవసరాలకు వాడుకొంటున్నట్లయితే 125 చదరపు గజాల భూమికి కూడా 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించాల్సి ఉంటుంది.
కబ్జా భూముల క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో ఎంఎస్ 58,59లను జారీ చేసింది. వాటి ప్రకారమే ఇప్పుడూ క్రమబద్దీకరించనున్నట్లు తాజా జీవోలో పేర్కొంది. 2014లో 125 చదరపు గజాల లోపు 91,639 దరఖాస్తులను, 125 చదరపు గజాలకు పైబడినవి 17,065 దరఖాస్తులను క్రమబద్దీకరించింది. అప్పుడు వచ్చిన దరఖాస్తులలో ఇంకా 2,86,871 పెండింగులో ఉన్నాయి. వాటిని, కొత్తగా వచ్చే దరఖాస్తులను కూడా ఈసారి ప్రభుత్వం పరిష్కరించనుంది. కబ్జా భూముల క్రమబద్దీకరణకు ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం తెలిపింది.