విభజన సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు

ఇటీవల రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రావిభజనపై చేసిన వ్యాఖ్యలతో రెండు తెలుగు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. సమస్యలను పరిష్కరించి విభజన హామీలను అమలుచేయకపోగా లోపాలు ఎట్టి చూపుతూ పుండు మీద కారం చల్లినట్లు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

బహుశః అందుకేనేమో కేంద్ర  విభజన సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ ఆశిష్ కుమార్‌ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎస్‌ఎస్ రావత్, రామకృష్ణారావులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రతీనెల ఒకసారి సమావేశమయ్యి ఒక్కో సమస్యను రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ త్రిసభ్య కమిటీ సమావేశం ఈనెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు వర్చువల్ పద్దతిలో జరుగుతుంది. 

ఏపీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదేళ్ళు కావస్తున్నా నేటికీ రెండు రాష్ట్రాల మద్య అనేక అంశాలపై సమస్యలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను పాలిస్తున్న పార్టీల అధినేతల మద్య సఖ్యత లేకపోవడం, సమస్యలను రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టి చూస్తుండటం వలన పట్టువిడుపులు, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి కొరవడటం, అనేక ఆర్ధిక, సాంకేతిక కారణాల వలన సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఇకనైనా సమస్యలు, వివాదాలకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి.