23.jpg)
సిఎం కేసీఆర్ శుక్రవారం జనగామ జిల్లా పర్యటన సందర్భంగా యశ్వంత్‌పూర్ వద్ద జరిగిన బహిరంగ సభలో జిల్లా ప్రజలకు వరాలు కురిపించారు. జనగామకు వైద్య కళాశాల, పాలకుర్తికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో వీటికి సంబందించి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. జనగామ నీతి సమస్య తీర్చేందుకు దేవాదుల నుంచి గోదావరి నీళ్ళు పారిస్తామని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏడాదిలోగా జనగామకు గోదావరి నీళ్ళు అందించే ఈ బాధ్యత మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నామని చెప్పారు.
ఒకప్పుడు నీళ్ళకి, కరెంటుకి అవస్థలు ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆ సమస్యలు లేవని, ఇక ఎన్నటికీ ఉండబోవని ఆవిదంగా శాస్విత ఏర్పాట్లు చేసుకొన్నామని సిఎం కేసీఆర్ అన్నారు. ఇదంతా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయడం వలననే సాధ్యం అయ్యిందని సిఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడక మునుపు జనగామ ఏవిదంగా ఉండేదో ఇప్పుడు ఏవిదంగా అభివృద్ధి చెందిందో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. ఒకప్పుడు ఎకరా రెండు మూడు లక్షలకు కూడా అమ్ముడుపోయేది కాదని కానీ ఇప్పుడు మారుమూల ప్రాంతాలలో కూడా రూ.25-30 లక్షలు పలుకుతోందని, అదే జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భూములైతే ఇంకా ఎక్కువ ధర పలుకుతోందని అన్నారు.
రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, దళితులు, అన్ని వర్గాల ప్రజలు సంపన్నులుగా మారాలని కోరుకొంటున్నాని, ఇప్పటికే రెండు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులు కోటీశ్వరులుగా మారారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇదేవిదంగా అభివృద్ధి పదంలో సాగిపోతూ భవిష్యత్‌లో అందరూ ధనవంతులయ్యే రోజు తప్పక వస్తుందని సిఎం కేసీఆర్ అన్నారు.
అయితే ఈ ఏడేళ్ళలో తెలంగాణలో జరిగిన అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఏమాత్రం తోడ్పడకపోగా, వ్యవసాయాన్ని, రైతులను దెబ్బ తీసేవిదంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలకు నష్టం కలగనీయకుండా కాపాడుకొంటానని సిఎం కేసీఆర్ అన్నారు.
అంతకు ముందు సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. దానిని చాలా అద్భుతంగా డిజైన్ చేశారని ఆర్కిటెక్ట్ ను ప్రశంశించారు. అలాగే కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు అధికారులతో మాట్లాడుతూ ఒకప్పుడు అన్ని విదాలా వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం, జనగామ మీ అందరి సమిష్టి కృషితో కేవలం ఏడేళ్ళలోనే అద్భుతంగా అభివృద్ధి సాధించిందని సిఎం కేసీఆర్ ప్రశంశించారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు ఎక్కువగా పొందుతారని తాను ఉద్యమసమయంలో చెప్పిన సంగతిని సిఎం కేసీఆర్ వారికి గుర్తు చేసి, భవిష్యత్‌లో ప్రతీ ఉద్యోగి సంపన్నులు కూడా అవుతారని అన్నారు.