
తెలంగాణ ఏర్పాటుకి సంబందించి ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టిఆర్ఎస్ ఎంపీలు, ఈరోజు రాజ్యసభలో ఆయన సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్‌కు ప్రివిలేజ్ నోటీసు అందజేశారు. ప్రధాని నరేంద్రమోడీ తక్షణం తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పాలని వారు దానిలో కోరారు. ఈరోజు రాజ్యసభ సమావేశం మొదలవగానే టిఆర్ఎస్ ఎంపీలు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య, సురేష్ రెడ్డి వెల్లోకి దూసుకువెళ్ళి నిరసనలు తెలియజేశారు. ఆ తరువాత కె.కేశవరావు డిప్యూటీ చైర్మెన్ హరివంశ్‌కు ప్రివిలేజ్ నోటీసు అందజేసి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. కానీ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు దీనిపై నిర్ణయం తీసుకొంటారని చెప్పడంతో టిఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వాకవుట్ చేశారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ నోటీసు ఇస్తామని టిఆర్ఎస్ ఎంపీలు చెప్పారు. ప్రివిలేజ్ నోటీసులపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం తీసుకొనేవరకు పార్లమెంటు సమావేశాలకు హాజరుకాబోమని టిఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.