యూపీ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్ షురూ

ఏడు దశలలో జరుగబోయే ఉత్తర ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల తొలిదశ ఎన్నికల పోలింగ్ నేడు ప్రారంభం అయ్యింది. యూపీలో మొత్తం 403 నియోజకవర్గాలు ఉండగా వాటిలో నేడు 11 జిల్లాలలోని 58 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతోంది. ఈ 58 సీట్లకు 623 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారిలో అధికార బిజెపికి చెందిన 9 మంది మంత్రులు కూడా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికలలో బిజెపి ఈ 58 స్థానాలలో 53 గెలుచుకొంది. అయితే ఈసారి బిజెపికి ఇక్కడ ఎదురు గాలులు వీస్తున్నాయి. 

నేడు పోలింగ్ జరుగనున్న పశ్చిమ యూపీలో మొత్తం 2.27కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో జాట్ కులస్థులు ఎక్కువగా ఉన్నారు. కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీసరిహద్దు వద్ద ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమంలో జాట్ కులస్థులు పాల్గొన్నారు. కనుక ఈసారి జాట్ ఓటర్లు బిజెపికి వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం ఉండవచ్చు. దీంతో తొలిదశ పోలింగ్ బిజెపికి అగ్నిపరీక్షగా మారింది.

యూపీ రెండో దశ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరుగుతాయి. ఆ తరువాత వరుసగా ఫిబ్రవరి 20,23,27, మార్చి 3, 4 తేదీలలో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.