విలేఖరి ప్రోత్సహించడంతోనే కోడి పుంజుకి టికెట్

కరీంనగర్‌కు వెళుతున్న ఆర్టీసీ బస్సు కండక్టర్ కోడి పుంజుకు రూ.30లు టికెట్ కట్ చేయడంపై మీడియాలో వచ్చిన వార్తలపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసి సజ్జనార్‌ స్పందించారు. ఆ ఘటనపై ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న శ్రీకుమార్ అనే సివిఆర్ న్యూస్ ఛానల్‌ విలేఖరి ప్రోత్సహించడంతో కండక్టర్ కోడి పుంజుకు టికెట్ కట్ చేశాడని వీసి సజ్జనార్‌ తెలిపారు. సంచలన వార్త కోసం శ్రీకుమార్ కండక్టరును ప్రోత్సహించినట్లు గుర్తించామని తెలిపారు. ఆర్టీసీ బస్సులలో పశువులు, పక్షులను తీసుకువెళ్ళేందుకు అనుమతి లేదని, కానీ కండక్టర్ కోడి పుంజును గుర్తించిన తరువాత దానికి టికెట్ కట్ చేసి నిబందనలు ఉల్లంఘించాడు కనుక ఈ ఘటనపై విచారణ జరిపి అతనిపై తగిన చర్యలు తీసుకొంటామని వీసి సజ్జనార్‌ తెలిపారు.