
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.138 కోట్లు వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. వాటిలో బాచుపల్లి-ఓఆర్ఆర్ రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అలాగే పేట్ బషీరాబాద్‌లో ఎస్టీపీ (మురుగునీరు ట్రీట్‌మెంట్ ప్లాంట్), కూకట్‌పల్లిలో నాలా విస్తరణ పనులకు మంత్రి కేటీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కూకట్‌పల్లిలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు రూ.5,000 కోట్లతో రెండు స్కైవేలను నిర్మించాలని భావిస్తున్నాము. అయితే వీటి నిర్మాణాలకు రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములు ఇవ్వాలని, వాటికి బదులుగా నగరంలో వేరే చోట భూములు ఇస్తామని కేంద్రానికి చాలాసార్లు విజ్ఞప్తి చేశాము కానీ పట్టించుకోలేదు. గుజరాత్‌లో వరదలు వస్తే ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటిన అక్కడకు వాలిపోయి ఉదారంగా వెయ్యి కోట్లు ఇచ్చేస్తారు కానీ హైదరాబాద్‌లో ఎన్నిసార్లు ఎంత పెద్ద వరదలు వచ్చినా పైసా ఇవ్వరు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ.7,800 కోట్లు ఇవ్వాలని కోరాం కానీ ఇస్తారో లేదో చూడాలి. రాష్ట్రంలోని బిజెపి ఎంపీలు తెలంగాణ కోసం హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రాన్ని అడిగి నిధులు తీసుకురారు కానీ మేము ఏదైనా పనులు చేపడితే వెంటనే అడ్డుపడతారు. రాష్ట్రం పట్ల వారికి బాధ్యత ఉందనుకొంటే ఈసారి బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడబోతున్న మా టిఆర్ఎస్ ఎంపీలకు వారు మద్దతు ఇవ్వాలి,” అని మంత్రి కేటీఆర్ అన్నారు.