తెలంగాణలో కేసీఆర్‌ సొంత రాజ్యాంగం అమలు: ఈటల

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 371కు సవరణలు చేయాలని కోరుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌లో నిన్న తలపెట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ ఘటనపై హుజూరాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందిస్తూ, “ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యలను సిఎం కేసీఆర్‌కు చెప్పుకోవాలంటే ఆయన వారికి అపాయింట్మెంట్ ఇవ్వరు. వారితో చర్చించకుండానే వారి బదిలీలకు సంబందించి జీవో జారీ చేశారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆయనకు పూర్తి సహకారం అందించాయి. వారి అండదండలతోనే కేసీఆర్‌ ఆనాడు ఉద్యమాలు సాగించారు. కానీ కేసీఆర్‌ ఇప్పుడు వారిని సంప్రదించడానికి ఇష్టపడటం లేదు. తాను ఒక మహారాజో... చక్రవర్తో అన్నట్లు...తాను చెప్పిందే వేదం...అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో భారత్‌ రాజ్యాంగానికి బదులు కేసీఆర్‌ తన సొంత రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరోనా ఆంక్షలను పాటిస్తూ తన కార్యాలయంలో జాగరణ దీక్ష చేయబోతే పోలీసులు మా పార్టీ కార్యాలయం తాళం, తలుపులు పగులగొట్టి బలవంతంగా బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. పైగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మేము పోలీస్ కేసులకు, అరెస్టులకు, జైళ్లకు భయపడి వెనక్కు తగ్గేవాళ్ళం కాము. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్య తీరేవరకు మేము పోరాడుతూనే ఉంటాము,” అని హెచ్చరించారు.