హైదరాబాద్‌లో ఈరోజు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనికీలు

ఈరోజు రాత్రి హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలలో న్యూ ఇయర్ ఈవెంట్స్ జరుగుతాయి. పబ్బులు, క్లబ్బులలో యువత మందేసి చిందేస్తుంది. మందుబాబుల కోసం నగరంలో రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. ఒంటి గంట వరకు వేడుకలు జరుపుకొనేందుకు ప్రభుత్వం అనుమతించింది. కనుక మద్యం సేవించి వాహనాలు నడిపేవారూ ఉంటారు. 

కనుక నగర ట్రాఫిక్ పోలీసులు ఈరోజు రాత్రి నగరంలో పబ్బులు, క్లబ్బులు ఎక్కువగా ఉన్న బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్టతో పలు ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనికీలు నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి రేపు తెల్లవారుజాము 3-4 గంటల వరకు తనికీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. బంజారా హిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆరు చోట్ల, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తొమ్మిది చోట్ల ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనికీలు నిర్వహించనున్నారు. 

ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పవని, డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీస్ విభాగం హెచ్చరించింది. కనుక మందుబాబులూ... జాగ్రత్త పడండి!