బండి సంజయ్‌ చేస్తున్నది కపట దీక్ష: కేటీఆర్‌

బండి సంజయ్‌ నేడు హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేస్తుండటాన్ని రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఆక్షేపించారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “బండి సంజయ్‌ చేస్తున్నది నిరుద్యోగ దీక్ష కాదు సిగ్గులేని అవకాశవాద దీక్ష. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో... రాష్ట్రంలో ఎంతమందికి కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందో బండి సంజయ్‌ చెప్పాలి. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐ‌టిఐఆర్‌ను కేంద్రం రద్దు చేసి లక్షలమందికి ఐ‌టి ఉద్యోగాలు రాకుండా చేసింది. కేంద్రప్రభుత్వ సంస్థలను మోడీ ప్రభుత్వం అమ్మేసుకొంటూ వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా రోడ్డున పడేస్తోంది. కేంద్రప్రభుత్వం తెచ్చిన జీఎస్టీతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలి? పెద్దనోట్ల రద్దుతో కోట్లాదిమంది జీవితాలు తల్లక్రిందులయ్యాయి. కరోనా సమయంలో కేంద్రప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది కానీ దానిలో ఒక్క రూపాయి తెలంగాణకు ఇవ్వలేదు. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకొని పార్టీ బిజెపి మాత్రమే. 

కానీ సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతోంది. రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలు, సంస్థలను ఏర్పాటవుతున్నాయి. వాటి ద్వారా లక్షాలాదిమందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తోంది మా ప్రభుత్వం. అందుకే దేశంలో అతితక్కువ నిరుద్యోగ సమస్య ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అయినా బండి సంజయ్‌ నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకే ఈ కపట దీక్ష చేస్తున్నారు. బండి సంజయ్‌కి యువతకు ఉద్యోగాలు కల్పించాలని అంత కోరిక ఉంటే ఢిల్లీ వెళ్ళి అక్కడ నిరుద్యోగ దీక్ష చేయాలి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీపై తమ అధిష్టానాన్ని నిలదీయాలి,” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.