హైదరాబాద్‌ బిజెపి కార్యాలయంలో నేడు నిరుద్యోగ దీక్ష

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో రాష్ట్ర బిజెపి నేతలు నేడు నాంపల్లి వద్ద బిజెపి కార్యాలయంలో నిరుద్యోగదీక్ష చేపట్టనున్నారు. మొదట ఇందిరా పార్కు వద్ద ఈ దీక్ష చేయాలని బిజెపి భావించింది కానీ పోలీసులు అనుమతించకపోవడంతో పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ తరుణ్ చుగ్ కూడా ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు. 

బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, “మేము చేయబోయే నిరుద్యోగ దీక్షతో టిఆర్ఎస్‌ పీఠం కదిలిపోతుందనే భయంతోనే కరోనా సాకుతో రాష్ట్రంలో సభలు, ర్యాలీలు నిర్వహించకూడదంటూ ప్రభుత్వం హడావుడిగా జీవో జారీ చేసింది. రాష్ట్రంలో ఏళ్ళ తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూసి చూసి నోటిఫికేషన్లు రాకపోవడంతో 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ మేము నిరుద్యోగ దీక్ష చేస్తుంటే అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తుండటం చాలా దుర్మార్గం. దీక్షలో పాల్గొనేందుకు వస్తున్న విద్యార్దులను, నిరుద్యోగ యువతీ యువకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుండటాన్ని మేము ఖండిస్తున్నాము. అయినా మా పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేసుకొంటే ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం? మా ఈ దీక్షకు రాష్ట్రంలో నిరుద్యోగులతో పాటు మేధావులు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము,” అని అన్నారు.