తీన్‌మార్ మల్లన్నా...ఇదేం పద్దతి?

ఇటీవల బిజెపిలో చేరిన చింతపండు నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్న తన క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో మంత్రి కేటీఆర్‌ కుమారుడి శరీరాకృతిపై అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్‌తో సహా పలువురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా శత్రుత్వముంటే రాజకీయంగానే ఎదుర్కోవాలి కానీ కుటుంబ సభ్యులను వాటిలోకి లాగడం, మహిళలు, పిల్లలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అండ చూసుకొనే తీన్‌మార్ మల్లన్న రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్‌మార్ మల్లన్న తీరు మార్చుకోకపోతే చెంపదెబ్బలు కాదు... చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. 

తీన్‌మార్ మల్లన్నపై పోలీసులు పలు కేసులు నమోదు చేసి జైలులో రెండున్నర నెలలు పెట్టడంతో సహజంగానే ఆయనకు టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఆగ్రహం ఉండవచ్చు. అయితే తన వెనుక బిజెపి...కేంద్రప్రభుత్వం ఉంది కనుక తనను ఇక ఎవరూ ఏమీ చేయలేరనుకొని హద్దులు మీరి మాట్లాడటం సరికాదు. రాజకీయాలలో ఉన్నవారు నోటిని అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడటం చాలా అవసరం. తప్పుగా మాట్లాడి మంత్రి పదవులు కోల్పోయినవారు కూడా ఉన్నారు.