ఉద్యోగుల కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం తాజా ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగులిచ్చుకొన్న ఆప్షన్స్ ప్రకారం ఆయా జిల్లాలకు కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే కొంతమంది...ప్రభుత్వోద్యోగులుగా పని చేస్తున్న తమ జీవితభాగస్వాములను కూడా తాము చేస్తున్న జిల్లాలకే బదిలీ చేయాలని కోరుతూ పై అధికారులకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అలాగే కొత్త జోనల్ విధానంలో కేటాయింపులపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిపై స్పందించిన సాధారణ పరిపాలన శాఖ ఈరోజు తాజాగా మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది.     

ఉద్యోగులు అందరూ ముందు తాము ఎంచుకొన్న జిల్లాలో పోస్టింగ్ తీసుకొని తరువాత జీవిత భాగస్వాముల బదిలీ గురించి అప్పీల్ చేసుకోవాలని సూచించింది. అలాగే కొత్త జోనల్ విధానంలో కేటాయింపులపై ఏవైనా అభ్యంతరాలున్నా కూడా ముందు పోస్టింగ్ తీసుకొన్న తరువాతే అప్పీలు చేసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులలో పేర్కొంది. 

జిల్లా కేడర్ ఉద్యోగులైతే జిల్లా శాఖాధిపతికి, జోనల్, మల్టీ జోనల్ కేడర్ ఉద్యోగులైతే వారివారి శాఖాధిపతులకు అప్పీళ్ళు చేసుకోవాలని ఉత్తర్వులలో సూచించింది. ఉద్యోగుల నుంచి తమకు అందిన అప్పీళ్ళపై శాఖాధిపతులు వీలైనంత త్వరగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.