.jpg)
కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌పై మంత్రి హరీష్ రావు ఈరోజు నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా మంత్రుల బృందం మిమ్మల్ని కలిసేందుకు వస్తే వారి పట్ల చాలా అవమానకరం వ్యవహరించారు. ధాన్యం కొనుగోలు స్పష్టత ఇవ్వాలని కోరేందుకు మా మంత్రులు వెళితే, ‘మీకు పనీ పాటు లేదా? చీటికి మాటికీ ఎందుకు ఢిల్లీ వస్తున్నారు? ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు?’ అంటూ అవమానించారు. ఇది వారిని మాత్రమే కాదు...యావత్ తెలంగాణ ప్రజలను 70 లక్షల మంది రైతులను అవమానించడమే. రాష్ట్ర మంత్రులను, ప్రజలను, రైతులను అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారు?కనుక మీ వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని దీనికి మీరు తప్పనిసరిగా మా ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలి,” అని డిమాండ్ చేశారు.
“రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చిన మంత్రుల బృందాన్ని కలవడానికి మీకు సమయం లేదు కానీ మీ పార్టీ నేతలను ఢిల్లీకి పిలిపించుకొని వారితో రాజకీయాలపై గంటల గంటలు చర్చిస్తారు. దీనిని బట్టే రాష్ట్రంలో మీ ప్రాధాన్యత ఏమిటో స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో రైతుల ఓట్లు మీకు కావాలి కానీ రైతులు పండించే ధాన్యం అక్కరలేదా?మీరే ఈవిదంగా రాజకీయాలు చేస్తూ మళ్ళీ మేము రాజకీయాలు చేస్తున్నామని పీయూష్ గోయల్ మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. కేంద్రమంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ ఈవిదంగా పచ్చి అబద్దాలు మాట్లాడటం ఏమి సబబు?” అని ప్రశ్నించారు.
“రాష్ట్రాలలో పండిన ధాన్యం కొనుగోలు చేయవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. కనుక ఇప్పుడు ఎంత తీసుకొంటారు? యాసంగి సీజనులో ఎంత తీసుకొంటారు?అని లిఖితపూర్వకంగా జవాబు చెప్పాలని కోరాము. ఇది తప్పా? ధాన్యం సేకరణ చేసి, దానిని విదేశాలకు ఎగుమతి చేసే అధికారం కేంద్రప్రభుత్వానికే ఉంది. ఒకవేళ కేంద్రానికి అది సాధ్యం కాకపోతే ఆ అధికారం మాకు ఇవ్వండి. మా రైతులు పండించిన ధాన్యాన్ని మేమే విదేశాలకు ఎగుమతి చేసుకొంటాము,” అని మంత్రి హరీష్‌రావు అన్నారు.
ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సరఫరా చేయలేకపోతోందని పీయూష్ గోయల్ చెప్పడాన్ని కూడా మంత్రి హరీష్‌రావు తప్పు పట్టారు. రాష్ట్రం నుంచి ధాన్యం రవాణాకు సరిపడా రైల్వే ర్యాకులు కేటాయించాలని కోరుతూ వివిద జిల్లాల అధికారులు వ్రాసిన లేఖలను మంత్రి హరీష్‌రావు ఈ సందర్భంగా చదివి వినిపించి, రైల్వే ర్యాకులు ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేయలేకపోతోందని పచ్చి అబద్దాలు చెప్పారని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.