
హుజూరాబాద్ ఉపఎన్నికలు సిఎం కేసీఆర్, ఈటల రాజేందర్ మద్య యుద్ధంలాగ సాగగా, దానిలో బిజెపి విజయం సాధించినప్పటి నుంచి ఆ యుద్ధం టిఆర్ఎస్, బిజెపిల మద్యకు మారడం విశేషం. ధాన్యం కొనుగోలుపై వాటి మద్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా మొన్న 20న టిఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి బిజెపికి చావుడప్పు కొట్టడం, బిజెపి నేతలు ఊర్లోకి వస్తే ప్రజలు తరిమితరిమి కొట్టాలని పిలుపు ఇవ్వడంపై బిజెపి అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉంది.
ఇదే అంశంపై చర్చించేందుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా రాష్ట్ర బిజెపి నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిలతో మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్తో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్దంకావాలని అమిత్ షా వారికి సూచించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో మళ్ళీ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించాలని, ఊరూవాడా బిజెపి సభలు, సమావేశాలు నిర్వహించాలని అమిత్ షా వారికి సూచించారు.
అక్రమ కేసులు, టిఆర్ఎస్ దాడులకు భయపడకుండా ముందుకు దూసుకుపోవాలని సూచించారు. టిఆర్ఎస్పై చేసే ఈ యుద్ధానికి పార్టీ తరపున వారికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు తాను సిద్దంగా ఉన్నానని, రాష్ట్ర బిజెపి నేతలు ఎప్పుడు ఎక్కడ సభ నిర్వహిస్తే అక్కడికి వస్తానని అమిత్ షా చెప్పారు.
ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్రాన్ని నిందిస్తూ రాష్ట్రంలో బిజెపికి రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న టిఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను, అవినీతిని బట్టబయలు చేయాలని అమిత్ షా వారికి సూచించారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, టిఆర్ఎస్ ముఖ్య నేతలు డికె.అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్, గరికపాటి మోహన్ రావు, ఇటీవలే బిజెపిలో చేరిన విఠల్, తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తరువాత మళ్ళీ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో వేరేగా సమావేశమయ్యారు.