
ధాన్యం కొనుగోలుపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ఆహార, పౌరసరఫరా శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలుపై మేము పూర్తి స్పష్టత ఇచ్చినప్పటికీ సిఎం కేసీఆర్ అబద్దాలు చెపుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రబీ సీజనులో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందం కంటే అదనంగా మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకోవడానికి కూడా అంగీకరించాము. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఈ అవకాశం ఇచ్చాము. కానీ ఆ ఒప్పందం ప్రకారం ఆ బియ్యానే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేకపోయింది. దీని కోసం నాలుగుసార్లు గడువు పొడిగించినప్పటికీ ఇవ్వలేకపోయింది. ఆ బియ్యం ఇవ్వకుండా మళ్ళీ ఈవిదంగా రాజకీయాలు చేస్తున్నారు. దేశంలో బాయిల్డ్ రైస్ పెద్దగా వాడరు అందుకే అది వద్దంటున్నాము. అయితే రా రైస్ ఎంత ఇస్తే అంతా తీసుకొంటామని చెపుతున్నాము. ఇదే విషయం పదేపదే చెపుతున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో పండిన బియ్యం తీసుకోవడానికి కేంద్రప్రభుత్వం నిరాకరిస్తోందంటూ సిఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. ఇకనైనా సిఎం కేసీఆర్ కేంద్రంపై బురద జల్లడం మానుకొని ఒప్పందం ప్రకారం బియ్యాన్ని వెంటనే సరఫరా చేస్తే బాగుంటుంది. ఇక్కడ మా పనులలో మేము బిజీగా ఉంటాము. క్షణం తీరిక ఉండదు. మేమేమీ తెలంగాణ మంత్రులను, ఎంపీలను ఇక్కడికి రమ్మని పిలవలేదు. ఈ అంశంపై ఇదివరకే వారితో మాట్లాడాను. మళ్ళీ కొత్తగా మాట్లాడేందుకు ఏమి ఉంటుంది?” అని అన్నారు.