తెలంగాణ రైతులకు శుభవార్త

రాష్ట్రంలో రైతులకు శుభవార్త! ఈనెల 28వ తేదీ నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలలో రైతు బంధు సొమ్ము జమా చేయాలని సిఎం కేసీఆర్‌ సంబందిత అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 28 నుంచి పది రోజుల్లోగా లబ్ధిదారులందరికీ రైతుబంధు సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. గతంలో మాదిరిగానే ముందుగా  ఎకరం పొలం ఉన్నవారితో మొదలుపెట్టి అందరికీ రైతు బంధు అందజేయాలని సూచించారు.  

శనివారం ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నత అధికారుల సమావేశంలో రైతులను ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రోత్సహించి, అందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వగైరాలు అందించి సహకరించాలని సూచించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో పండే బియ్యం కొనబోమని స్పష్టం చేసినందున ఈసారి యాసంగి సీజన్‌లో రైతులు వరి పండించవద్దని నచ్చజెప్పాలని సూచించారు. అయితే రైసు మిల్లర్లు, వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని వరి పండిస్తున్నవారిని, సొంత అవసరాలకు వరి వేసుకొన్నవారిని ఇబ్బంది పెట్టవద్దని సిఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. వరి పండించే రైతులకు రైతు బంధు నిలిపివేయాలనే కొందరు అధికారుల ప్రతిపాదనను సిఎం కేసీఆర్‌ నిర్ద్వందంగా త్రోసిపుచ్చారు. రాష్ట్రంలో రైతులందరికీ తప్పనిసరిగా రైతు బంధు అందించాలని ఆదేశించారు.