
హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించిన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇవాళ్ళ హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “హుజూరాబాద్‌లో నన్ను ఓడించేందుకు సిఎం కేసీఆర్ రూ.600 కోట్లు వరకు నల్లధనం ఖర్చు పెట్టారు. ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే దళిత బంధు పధకం ప్రకటించారు అయినా టిఆర్ఎస్ గెలవలేకపోయింది. దళిత బంధును ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు?అంటే అది దళితులపై ప్రేమతో కాక ఉపఎన్నిక కోసమే దళిత బంధు పధకం ప్రకటించారని స్పష్టమవుతోంది.
రైతు బంధు ప్రకటించినప్పుడు దానిని వందల ఎకరాలున్న భూస్వాములకు కాకుండా కౌలు రైతులకు వర్తింపజేయాలని నేను కోరాను. కానీ సిఎం కేసీఆర్ నా సూచనను పట్టించుకోలేదు. సంబంధిత శాఖల మంత్రులు లేకుండానే సిఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో వారి శాఖలను సమీక్షిస్తుంటారు. రాష్ట్రంలో అందరి భూముల మీద అజమాయిషీ కోసమే ధరణీ పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. క్షేత్రస్థాయిలో భూమి ఒకరి అధీనంలో ఉంటే, ధరణీలో వేరేవారి పేరుంటుంది.
ఈ ఉపఎన్నిక తరువాత నేను కాంగ్రెస్ పార్టీలో చేరిపోతానంటూ ఉపఎన్నికల సమయంలో టిఆర్ఎస్ దుష్ప్రచారం చేసింది. కానీ నేను బిజెపిలోనే ఉంటాను. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి తీసుకువచ్చేందుకు గట్టిగా కృషి చేస్తాను. బిజెపి అధిష్టానం ఆదేశిస్తే వచ్చే శాసనసభ ఎన్నికలలో సిఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు నేను సిద్దం,” అని ఈటల రాజేందర్‌క చెప్పారు.