ఇక ఓటర్ కార్డ్...ఆధార్‌తో అనుసంధానం

దేశంలో ఇప్పటికే రేషన్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, చివరికి గ్యాస్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ వంటివన్నీ ఆధార్ కార్డుతో అనుసంధించబడ్డాయి. ఇప్పుడు ఓటర్ కార్డులను కూడా కేంద్రం ఆధార్‌తో అనుసందించబోతోంది. బుదవారం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా దొంగ ఓట్లు అరికట్టవచ్చని కేంద్ర ఎన్నికల కమీషన్‌ కేంద్ర న్యాయశాఖకు సూచించింది. దాని సూచనల మేరకు ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఏడాదికి నాలుగుసార్లు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే  అవకాశం ఉంది.

దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంక్ పెంచుకొనేందుకు దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా దేశ సరిహద్దులలో ఉన్న రాష్ట్రాలలో కొన్ని పార్టీలు తమ ఓటు బ్యాంక్ పెంచుకొనేందుకు అక్రమంగా దేశంలోకి జొరబడుతున్న విదేశీయులకు ఆధార్, ఓటర్ కార్డులు సమకూర్చుతున్నాయి. అలాగే దేశంలో చాలా మందికి రెండు మూడు రాష్ట్రాలలో ఓటర్ కార్డులు కలిగి ఉన్నారు. వీటన్నిటికీ ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా అడ్డుకట్టవేయవచ్చని ఈసీ భావిస్తోంది. అయితే ఆధార్ కార్డు జారీని కూడా కట్టడి చేయగలిగినప్పుడే ఆశించిన ఫలితం ఉంటుంది. లేకుంటే ఆధార్ కార్డు సులువుగా పొందగలిగినప్పుడు దాంతో ఓటర్ కార్డు పొందడం కష్టమేమీ కాదు.